EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 10:39 am Posted by : EVUSAM TV

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

ఎవుసం టీవీ, రేగొండ: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకునే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని భూపాలపల్లి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తిరుపతి,మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవ రెడ్డి అన్నారు. గురువారం రేపాక గ్రామంలోని రైతు వేదికలో ఆత్మ (ATMA) పథకం ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి తిరుపతి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల వైవిధ్యీకరణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే ఉద్యాన పంటలు, కూరగాయలతో పాటు ఆయిల్‌పామ్‌ సాగు చేపడితే రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం ఏవో పెద్ది వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం సాగులో ఉన్న వరి,పత్తి పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య చర్యలను వివరించారు. రాబోయే ముందస్తు వేసవి కాలంలో తక్కువ నీటితో, తక్కువ కాలపరిమితిలో పూర్తయ్యే పెసరు, మినుము, మొక్కజొన్న పంటలపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నేల స్వభావం, నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవడం వల్ల సాగు ఖర్చులు తగ్గి లాభాలు బాటపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ BTT సభ్యుడు నడిపెల్లి సంజీవ రావు, వ్యవసాయ విస్తరణ అధికారి నాగరాజు, ప్రకృతి వ్యవసాయ రైతు జంగిలి కృష్ణమూర్తితో పాటు రేపాక, రేపాకపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.