EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 2:15 pm Posted by : EVUSAM TV

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన

ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా కృషి సఖీలకు క్షేత్రస్థాయి శిక్షణ అందించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం మూడో రోజు కాగజ్‌నగర్ మండలంలోని కోసిని గ్రామంలో క్షేత్ర సందర్శన చేపట్టారు.కోసిని గ్రామానికి చెందిన రైతులు వై. వెంకటేశ్వర్లు, సురేష్ నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను కృషి సఖీలు, సీఆర్‌పీలు సందర్శించారు. గత ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న రైతులు.. రసాయన ఎరువులకు దూరంగా ఉంటూ ప్రకృతి వనరులతో వరి సాగు చేస్తున్న విధానాన్ని వివరించారు.పంటల సాగులో వినియోగించే బీజామృతం, జీవామృతం, పంచగవ్య వంటి సహజ వనరులను ఇంటి వద్దే తయారు చేసుకునే విధానాన్ని రైతులు క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. వీటి తయారీ, వినియోగం, పంటలపై వాటి ప్రభావం తదితర అంశాలను సీఆర్‌పీలకు వివరించారు.అనంతరం క్షేత్రంలోని అధిక సాంద్రత పత్తి సాగు, అలాగే ఆయిల్‌పామ్ తోటలను కృషి సఖీలు పరిశీలించారు. వివిధ పంటల సాగు విధానాలు, రైతులు అనుసరిస్తున్న పద్ధతులపై క్షేత్రస్థాయిలో అవగాహన పొందారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకట్, వ్యవసాయ సహాయ సంచాలకులు మనోహర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఎం. మధు, మండల వ్యవసాయ అధికారి జి. రామకృష్ణ, టెక్నికల్ వ్యవసాయ అధికారి దీప్తితో పాటు 21 మంది సీఆర్‌పీలు పాల్గొన్నారు.