
ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ముందుకు సాగేందుకు సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్–2026 వేదికగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని హోటల్ ట్రైడెంట్‌లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు కొనసాగుతోంది.కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సదస్సుకు హాజరై ప్రారంభోపన్యాసం అందించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సదస్సులో పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు మెరుగైన సేవలు అందించడం, కేంద్ర పథకాల అమలును సమర్థవంతంగా కొనసాగించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించడం వంటి అంశాలపై సదస్సులో చర్చలు కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర APC, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, IAS సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సమయానుకూలంగా వ్యవసాయ సమాచారం, సాంకేతిక సలహాలు, మార్గదర్శకాలు అందిస్తున్న తీరును వివరించారు.అనంతరం కేంద్ర ప్రయోజిత పథకాలు, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (DAM), రైతు రిజిస్ట్రీ, ఎరువుల నిర్వహణ, సహజ వ్యవసాయం, పప్పుధాన్యాలు, ఆయిల్‌పామ్, ఉద్యానవన రంగం తదితర అంశాలపై సమీక్ష, చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాల వారీగా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, రైతులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సవాళ్లపై కూడా సమావేశంలో చర్చిస్తున్నారు.వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు ప్రభుత్వ పథకాలు, సాంకేతిక సేవలు సమర్థవంతంగా అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంపై సదస్సులో దృష్టి సారించారు.ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు రామ్ నాథ్ ఠాకూర్, భాగీరథ్ చౌదరీతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్–నికోబార్ దీవుల నుంచి వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు, వ్యవసాయ సంచాలకులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి APC, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి తదితరులు పాల్గొన్నారు.