.కంది పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు .వాంకిడి,కెరెమెరి,ఆసిఫాబాద్ మండలాల్లో ముగిసిన శిక్షణా కార్యక్రమం


ఎవుసం టీవీ,కొమురం భీం ఆసిఫాబాద్:నాణ్యమైన విత్తనం కోసం వేర్పాటు దూరం (Isolation Distance), పంట పరిశుభ్రత, కల్తీల ఏరివేత (Roguing) వంటి సాంకేతిక అంశాలు పాటించడం ఎంతో కీలకమని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా.ఎం.మధు స్పష్టం చేశారు. నాబార్డ్ (NABARD) ఆర్థిక సహకారంతో, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయంతో వాంకిడి, కెరెమెరి మరియు ఆసిఫాబాద్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఆధ్వర్యంలో రైతులకు విత్తనోత్పత్తిపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో డా.మధు మాట్లాడుతూ.. కంది పంటలో విత్తనోత్పత్తిలో రైతులు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సవివరంగా వివరించారు. ముఖ్యంగా పంటలో వచ్చే పురుగులు,తెగుళ్ల నివారణ చర్యలు మరియు కోత సమయాల్లో పాటించాల్సిన పద్ధతులపై ఆయన అవగాహన కల్పించారు. నాబార్డ్ సహకారంతో చేపట్టిన ఈ విత్తనోత్పత్తి ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు.
రైతు నుంచే రైతుకు విత్తనం : పీఏసీఎస్ చైర్మన్
రైతులు స్వయంగా విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పీఏసిఎస్ చైర్మన్ అలీబిన్ అహ్మద్ అన్నారు. “రైతు నుంచి రైతుకే విత్తనం” విధానంతో మేలైన విత్తనం అందరికీ తక్కువ ఖర్చులోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాబార్డ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తక్కువ ఖర్చు… ఎక్కువ ఆదాయం: డీఏఓ
కంది పంట తక్కువ ఖర్చుతో ఎక్కువ నికర ఆదాయాన్నిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి తెలిపారు. రాబోయే రబీ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగం తక్కువగా ఉండే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ను కంది కోతల అనంతరం పప్పుధాన్యాలు (అపరాలు) లేదా జొన్న, సజ్జ వంటి ఆరుతడి చిరుధాన్యాల సాగుతో నీటి కొరతను అధిగమించి లాభాలు సాధించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆర్. ప్రహల్లాద, పీఏసీఎస్ చైర్మన్లు రమణ, ఓమాజీ, విజయ్,ఎంబిఏ మిలింద్, ఆదర్శ రైతులు కేంద్రీ బాలాజీ, రామ్ చందర్, మహాదుతో పాటు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు.