EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:26 pm Posted by : EVUSAM TV

కంది విత్తనోత్పత్తి పై రైతులకు అవగాహన సదస్సు

 

ఎవుసం టీవీ, కొమురం భీం ఆసిఫాబాద్: ప్రైవేటు కంపెనీలపై ఆధారపడకుండా రైతులే స్వయంగా నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. ఎం. మధు సూచించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో, నాబార్డ్ (NABARD) ఆర్థిక సహకారంతో కంది పంట విత్తనోత్పత్తిపై శనివారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. ఎం. మధు మాట్లాడుతూ, కంది పంటలో నాణ్యమైన విత్తనోత్పత్తికి పాటించాల్సిన మెళుకువలను రైతులకు వివరించారు. ముఖ్యంగా విత్తన పంటకు పాటించాల్సిన వేర్పాటు దూరం (Isolation Distance), పంట పరిశుభ్రత, కల్తీల ఏరివేత (Roguing) వంటి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే పంటలో ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు, సరైన సమయంలో పంట కోత తదితర అంశాలను క్షుణ్ణంగా తెలియజేశారు. నాబార్డ్ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.అనంతరం ప్యాక్స్ సీఈఓ రమణ మాట్లాడుతూ.. రైతులు స్వయంగా విత్తనోత్పత్తి చేపట్టడం వల్ల సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు. “రైతు నుంచి రైతుకే విత్తనం” అనే విధానం ద్వారా ప్రతి రైతుకు తక్కువ ధరలోనే మేలైన విత్తనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బందితో పాటు 30 మంది రైతులు పాల్గొన్నారు.