EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 10:16 am Posted by : EVUSAM TV

పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు తప్పనిసరి : ఏఈఓ చిలువేరి ప్రవీణ్

ఎవుసం టీవీ,చందుర్తి: పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని చందుర్తి మండలం,మూడపల్లి క్లస్టర్ ఏఈఓ చిలువేరి ప్రవీణ్ సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు మరియు జిల్లెళ్ళలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు   అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందు కలిపేటప్పుడు, పిచికారీ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు, కళ్లకు గాగుల్స్, ముఖానికి మాస్క్, పూర్తి శరీరాన్ని కప్పే దుస్తులు, కాళ్లకు బూట్లు ధరించాలన్నారు. గాలి వీచే దిశకు అనుగుణంగా మాత్రమే పిచికారీ చేయాలని, గాలి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ పిచికారీ చేయవద్దని హెచ్చరించారు. మందు కలిపే సమయంలో చేతులతో కలపడం, తినడం, తాగడం, పొగతాగడం, ఫోన్ మాట్లాడడం వంటివి చేయరాదన్నారు.పిచికారీ అనంతరం సబ్బుతో చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలని, దుస్తులను విడిగా ఉతకాలన్నారు. పురుగు మందు డబ్బాలపై ఉండే గుర్తులను గమనించాలన్నారు. ఎరుపు రంగు అత్యంత విషకారి, పసుపు రంగు అధిక విషకారి, నీలం రంగు సామాన్య విషకారి, ఆకుపచ్చ రంగు స్వల్ప విషకారి అని వివరించారు. మందులను ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయరాదని, పిల్లలకు అందుబాటులో ఉంచరాదని, నీటి వనరుల వద్ద కడగరాదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు..