EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 1:33 am Posted by : EVUSAM TV

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ రోహిత్.. రైతు మురళి సాగు విధానాలపై ప్రశంసలు

ఎవుసం టీవీ, ఎల్కతుర్తి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటలు సాగు చేస్తూ, సహజ వనరుల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్న ప్రకృతి వ్యవసాయ అభ్యుదయ రైతు కర్రె మురళీధర్ వ్యవసాయ క్షేత్రాన్ని హన్మకొండ జిల్లా ట్రైనీ ఐఏఎస్ అధికారి రోహిత్ సందర్శించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో ఉన్న ఈ క్షేత్రాన్ని పరిశీలించిన ఆయన.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు విధానాలు, పశుపోషణ గురించి రైతును అడిగి తెలుసుకున్నారు..ప్రకృతి వ్యవసాయ రైతు మురళీధర్ మాట్లాడుతూ..ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తితో సహజ సాగు పద్ధతులను అనుసరిస్తున్నట్లు వివరించారు. జీవామృతం, ద్రవ జీవామృతం, అగ్నాస్త్రం,నీమాస్త్రం వంటి సహజ కషాయాలను ఉపయోగిస్తూ పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో పశుపోషణకు కూడా ప్రాధాన్యమిస్తూ ఆవులు,కోళ్ల పెంపకం చేస్తున్నట్లు వివరించారు.రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి, ప్రకృతికి అనుకూలమైన సాగు విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని మురళి అభిప్రాయపడ్డారు.అనంతరం ట్రైనీ ఐఏఎస్ రోహిత్ మాట్లాడుతూ.. సహజ వనరులను వినియోగించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు మురళి ప్రయత్నాన్ని అభినందించారు. ఇలాంటి పర్యావరణహిత సాగు విధానాలపై ఇతర రైతులు కూడా అవగాహన పెంపొందించుకుని, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డివిజన్ ఏడీఏ ఆదిరెడ్డి,ఎల్కతుర్తి ఏఈఓ పున్నం చందర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.