EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:09 am Posted by : EVUSAM TV

నేల ఆరోగ్యమే రైతు భవిష్యత్తు: ఏఈఓ నాగరాజు

ఎవుసం టీవీ,రేగొండ:  నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే రైతులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని కనపర్తి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నాగరాజు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’లో భాగంగా రేగొండ మండలంలోని రేపాక గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. “సేవ్ ద సాయిల్, సేవ్ ఫార్మింగ్, సేవ్ ఫార్మర్స్” అనే నినాదంతో భూసార పరిరక్షణ ఆవశ్యకతను వివరించిన ఆయన, భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే సమతుల్య ఎరువులను వాడాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పచ్చిరొట్ట పైర్లు మరియు జీవ ఎరువుల వినియోగంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. అలాగే భూగర్భ జలాల పరిరక్షణకు చిరుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. మార్కెట్‌లో లభించే నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం-కిసాన్, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.