EVUSAM TV
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 1:51 pm Posted by : EVUSAM TV

వ్యవసాయంలో గేమ్ ఛేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ విప్లవం: వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి, IAS

ఎవుసం టీవీ, రాజేంద్రనగర్: భారతదేశంలో వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేందుకు క్లైమేట్ ఇంటెలిజెన్స్ విప్లవం గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి, IAS అన్నారు.కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో అక్టోబర్ 30, 31 తేదీల్లో జరుగుతున్న ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్, అగ్రిబిజినెస్ మోడలింగ్’ పై జాతీయ స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.వాతావరణ విపత్తులైన ఎల్ నినో, తుఫానుల వంటి వాటిని ఎదుర్కోవడానికి కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. వాతావరణ సమాచారం రైతు స్థాయిలో అందుబాటులో ఉంటే రైతులు సాగు ఖర్చులను తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవచ్చని, ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంక్ కూడా చెబుతోందని తెలిపారు.వెదర్ ఫోర్‌కాస్టింగ్, క్లైమేట్ చేంజ్ వంటి అంశాలు నేడు రైతుల జీవితంలో భాగమయ్యాయని, వెదర్ డేటాబేస్ సేకరణలో తెలంగాణ దేశంలోనే ముందుందని అన్నారు. తెలంగాణ డిజిటల్ క్రాప్ డేటాబేస్‌లో 55 లక్షల మందికి పైగా రైతుల సమాచారం ఉందని, కేంద్ర పథకాలు, పంట రుణాలు, వాతావరణ సూచనలను రైతులకు చేరవేయడంలో ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.వాతావరణ అంచనాలు మరింత వాస్తవికంగా, రైతులు పంటలను నిర్ణయించుకునేలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఔట్రీచ్ వింగ్ అడ్వైజర్ డా. జె.వి. సింగ్ మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో 150 కి.మీ రిజల్యూషన్ నుంచి 6 కి.మీ రిజల్యూషన్ స్థాయికి ఎదిగామని, హైపర్‌ఫార్మెన్స్ కంప్యూటర్లతో ప్రపంచ వాతావరణ అంచనాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించిన ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. దండా రాజిరెడ్డి మాట్లాడుతూ… వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానించి కచ్చితమైన సూచనలు ఇస్తున్నామని, ఇకపై దీనిని అగ్రిబిజినెస్ మోడలింగ్‌కు అన్వయించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా ‘క్లైమేట్ అనలిటిక్స్’, ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్’ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది.ఈ కార్యక్రమంలో క్లైమేట్ నిపుణులు, విశ్వవిద్యాలయ అధికారులు, ప్రొఫెసర్లు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.