ఎవుసం టీవీ, ఎల్కతుర్తి: ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సుస్థిర సాగు విధానాలపై క్షేత్రస్థాయి అవగాహన పొందేందుకు హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రతినిధుల బృందం హన్మకొండ జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించింది.హన్మకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన రైతు కె. మురళీధర్ నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రతినిధుల బృందం సందర్శించింది. ASCI సంస్థకు చెందిన ‘పీజీ డిప్లొమా ఇన్ సస్టైనబుల్ కలెక్టివ్స్ మేనేజ్‌మెంట్ – 2026’ కోర్సు విద్యార్థులు, అధ్యాపక బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతు మురళీధర్ తన వ్యవసాయ క్షేత్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రతినిధులకు వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా ఉంటూ సహజ సిద్ధమైన పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్న విధానాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా జీవామృతం, ఘనజీవామృతం, వివిధ రకాల కషాయాల తయారీ, వినియోగ పద్ధతులతో పాటు అంతర పంటల సాగు విధానాలను మురళీధర్ వివరించారు. సహజ వనరులను వినియోగించుకుంటూ సాగు ఖర్చులను తగ్గించడం, నేల సారాన్ని కాపాడటం, నాణ్యమైన దిగుబడులు సాధించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సుస్థిర యాజమాన్య పద్ధతులపై అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు ఈ క్షేత్ర పర్యటన ప్రత్యక్ష అనుభవాన్ని అందించింది. ప్రకృతి వ్యవసాయ విధానాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో, వాటి ద్వారా పర్యావరణ పరిరక్షణకు, భూసార సంరక్షణకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకునే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ASCI ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణతో పాటు నేల ఆరోగ్యం, మానవ ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తుందని అభిప్రాయపడ్డారు. తమకు వ్యవసాయ పద్ధతులను వివరంగా తెలియజేసిన రైతు కె. మురళీధర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్న రైతు మురళీధర్ క్షేత్రం విద్యార్థులకు సుస్థిర వ్యవసాయంపై ఒక ప్రత్యక్ష అధ్యయన వేదికగా నిలిచింది.