
ఎవుసం టీవీ, తోర్నాల: పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తూ రైతులు ప్రత్యామ్నాయ లాభదాయక పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ఆధ్వర్యంలో ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నూనెగింజ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రొద్దుతిరుగుడు KBSH-90 హైబ్రిడ్ విత్తనాలను పంపిణీ చేశారు.బుస్సాపూర్, రావురూకుల, పెద్దమాసాన్పల్లి గ్రామాలకు చెందిన 60 మంది రైతులకు ఒక్కొక్కరికి 2 కిలోల ప్యాకెట్ చొప్పున ప్రొద్దుతిరుగుడు KBSH-90 హైబ్రిడ్ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం, తోర్నాల శాస్త్రవేత్త మరియు అధిపతి డా. జి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు వరి వంటి సాంప్రదాయ పంటలపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ లాభదాయక పంటగా ప్రొద్దుతిరుగుడు సాగు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేసిన ఆధునిక సాగు సాంకేతికతలను రైతుల పొలాల్లో ప్రత్యక్షంగా ప్రదర్శించి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించడం, దేశీయ నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడటం ఈ కార్యక్రమ లక్ష్యాలని వివరించారు. అనంతరం ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త నీలిమ మాట్లాడుతూ.. ప్రొద్దుతిరుగుడు పంటలో అందుబాటులో ఉన్న వివిధ హైబ్రిడ్ రకాలు, వాటి ప్రత్యేక గుణగణాలు, సాగులో వాటి ప్రాధాన్యత గురించి వివరించారు. సేద్య విభాగ శాస్త్రవేత్త డా. శ్వేత మాట్లాడుతూ.. ప్రొద్దుతిరుగుడు సాగులో పాటించాల్సిన మెలకువలను వివరించారు. సరైన విత్తన మోతాదు, సకాలంలో విత్తడం, మొక్కల మధ్య తగిన దూరం పాటించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు. కీటక శాస్త్రవేత్త డా. రమాదేవి మాట్లాడుతూ.. యాసంగి పంటల్లో ఆశించే వివిధ రకాల చీడపీడలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి వివరించారు.అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త సరిత మాట్లాడుతూ మొక్కజొన్న, పప్పుదినుసుల సాగు విధానాలు, అందుబాటులో ఉన్న వివిధ రకాలు, వాటి ప్రత్యేకతలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, పంటల వైవిధ్యీకరణ ద్వారా వ్యవసాయంలో స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు కృషి చేయాలని వారు రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు..

