కొడవటంచ,జోగయ్యపల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన
ఎవుసం టీవీ, రేగొండ: నేల ఆరోగ్యాన్ని కాపాడటం, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దేశవ్యాప్త ‘ఖేత్ బచావో అభియాన్’లో భాగంగా రేగొండ మండలం కొడవటంచ, జోగయ్యపల్లి గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ క్లస్టర్ ఏఈఓ పోలు ప్రవీణ్ కుమార్ పాల్గొని “సేవ్ ద సాయిల్, సేవ్ ఫార్మింగ్, సేవ్ ఫార్మర్స్” నినాదంతో భూసార పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వాడాలని, పచ్చిరొట్ట, జీవ ఎరువులతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, భూగర్భ జలాల పరిరక్షణకు చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పీఎం-కిసాన్, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

