ఎవుసం టీవీ, హైదరాబాద్: రైతు సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, అనుబంధ శాఖల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎకో పాండ్స్, వెదురు సాగు, ప్రభుత్వం నోటిఫై చేసిన 9 రకాల వరి రకాలను సాగు చేస్తున్న రైతుల నమోదు, వ్యవసాయ యాంత్రీకరణ, కేంద్ర నిధుల సద్వినియోగం, ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై మంత్రి సమీక్షించారు. ప్రతి ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు.నకిలీ డీఏపీ ఎరువుల తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నకిలీ డీఏపీ తయారీకి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసి, 6 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. నకిలీ ఎరువుల కారణంగా నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.వ్యవసాయ మార్కెట్లలో అమలులో ఉన్న ఆర్డీ విధానాన్ని పూర్తిగా తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.అనంతరం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణలో RKVY, FFS యాప్ అమలులో సాధించిన పురోగతిని అభినందించారు. రాష్ట్రానికి రావాల్సిన RKVY నిధులను త్వరగా విడుదల చేయాలని, పప్పుధాన్యాలను 100 శాతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రిని కోరారు.కోస్టారికాకు చెందిన ASD ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తెలంగాణ వాతావరణం, నేల పరిస్థితులకు అనుకూలంగా ఉండే ఆధునిక, అధిక దిగుబడినిచ్చే ఆయిల్‌పామ్ రకాలపై చర్చించారు.సమీక్ష సమావేశంలో ఏపీసీ కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు బి. గోపి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

