ఎవుసం టీవీ, కొమురం భీం ఆసిఫాబాద్: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, కొమురంభీం ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మండలంలోని న్యూ దెమాడిగూడ గ్రామంలో వరి పంటలో సల్ఫైడ్ దుష్ప్ర భావం మరియు దాని నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TRVK కోఆర్డినేటర్ డా. ఎం. మధు మాట్లాడుతూ.. వరి పొలాల్లో నీరు బయటకు వెళ్లకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటం మరియు 20:20:0:15, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంటి సల్ఫర్ సంబంధిత ఎరువులను అధిక మోతాదులో వాడటం వల్ల భూమిలో సల్ఫైడ్ దుష్ప్రభావం ఏర్పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వరి పైరు ఎదుగుదల ఆగిపోయి గిడసబారిపోవడం, ఆకులు పసుపు వర్ణంలోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, మొక్కను పీకి వేర్లను గమనిస్తే వేరు వ్యవస్థ నల్లగా మారి కుళ్లిన వాసన రావడం, అలాగే పొలంలో నడిచినప్పుడు నేల నుండి బుడగలు రావడం వంటివి ఈ సమస్యకు ప్రధాన సూచికలని వివరించారు. ఈ లక్షణాలను గమనించిన వెంటనే దీనిని సల్ఫైడ్ దుష్ప్రభావంగా గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నివారణలో భాగంగా పొలంలోని మురుగు నీటిని వెంటనే బయటకు తీసి మళ్లీ నీరు అందించాలని, పొలాన్ని సన్నని నెర్రెలు వచ్చే వరకు ఆరబెట్టి అప్పుడప్పుడు నీరు పెట్టాలని, నేలను బాగా ఆరనివ్వాలని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మోనియం సల్ఫేట్ వంటి గంధకం ఎరువులను వాడకూడదని, వేరు వ్యవస్థ బలంగా తయారయ్యేందుకు భాస్వరం సంబంధిత ఎరువులను, మొక్కలో రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు పొటాష్ ఎరువులను వాడాలని సూచించారు. అంతేకాకుండా ఇటువంటి సమస్య ఉన్న ప్రాంతాల్లో భవిష్యత్తులో పైరు వేయడానికి ముందు మడి తయారు చేసే సమయంలో ఎకరాకు ఒకటి నుండి రెండు బండ్ల ఎర్రమట్టిని వేసి బాగా కలియబెట్టి భూమిని ఎత్తు చేసి ఆరబెట్టడం ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా నివారించవచ్చని రైతులకు వివరించారు.
