హైదరాబాద్,ఆగస్టు 11, 2026: రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల సాగు, సేకరణను ప్రోత్సహించడంతో పాటు రైతులకు స్థిరమైన మార్కెట్ కల్పించే అంశంపై మంగళవారం ప్రజాభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ఎల్ నినో నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అధ్యక్షత వహించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి, విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్‌తో పాటు ఉద్యానవన, సెర్ప్, హరేకృష్ణ మిషన్, మన్నా ఫౌండేషన్, అక్షయపాత్ర ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
39 సెంట్రలైజ్డ్ కిచెన్లకు నేరుగా కూరగాయల సేకరణ
రాష్ట్రవ్యాప్తంగా 39 సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిధిలో కూరగాయల సాగును ప్రోత్సహించి, రైతుల నుంచి నేరుగా కూరగాయలను సేకరించే విధానంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.రాష్ట్రంలోని సుమారు 20.50 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు ప్రతిరోజూ సుమారు 1.20 లక్షల కిలోల కూరగాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ అవసరాన్ని స్థానికంగా రైతుల నుంచి సేకరించడం ద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు తాజా కూరగాయలతో కూడిన పోషకాహారం అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రైతులు, మహిళా సంఘాలకు అవకాశం
కిచెన్ల పరిధిలో ఇప్పటికే కూరగాయలు సాగు చేస్తున్న రైతులతో పాటు, కొత్తగా కూరగాయల సాగు చేపట్టాలనుకునే రైతులు, మహిళా రైతులు, మహిళా సంఘాలను గుర్తించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.రైతులకు అవసరమైన విత్తనాలు, నీటి వసతి, సబ్సిడీలు, మార్కెటింగ్, సేకరణ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
ఈ నెల 17 నుంచి క్షేత్రస్థాయి పరిశీలన
ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖలకు చెందిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతుల అవసరాలు, సాగు విస్తీర్ణం, విత్తనాల లభ్యత, నీటి వసతి, సబ్సిడీలు, మార్కెటింగ్, కూరగాయల సేకరణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించనున్నారు.సేకరించిన వివరాల ఆధారంగా జిల్లా స్థాయిలో సమగ్ర నివేదికను రూపొందించి ఆగస్టు 22వ తేదీలోగా రాష్ట్రస్థాయికి పంపించాలని డాక్టర్ జీ. చిన్నారెడ్డి అధికారులను ఆదేశించారు.
22న తదుపరి కార్యాచరణపై నిర్ణయం
ఆగస్టు 22న నిపుణుల కమిటీ మరోసారి సమావేశమై కూరగాయల సేకరణ, మహిళా సంఘాల భాగస్వామ్యం, 39 సెంట్రలైజ్డ్ కిచెన్లకు సరఫరా వ్యవస్థ, రైతులకు అవసరమైన ప్రభుత్వ సహాయంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది.రైతు పండించిన కూరగాయలకు స్థిరమైన మార్కెట్.. మహిళా సంఘాలకు ఉపాధి.. విద్యార్థులకు తాజా పోషకాహారం అందించే సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.

