రైతుల ప్రయోజనాలకు సమగ్ర విత్తన చట్టం

Date:

Share post:

ఎవుసం టీవీ, హైదరాబాద్: తెలంగాణలో విత్తన రంగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విత్తన చట్టం తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. విత్తన ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు నియంత్రణ, నాణ్యత ప్రమాణాల అమలు, ధరల నియంత్రణతో పాటు నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల పంట నష్టపోయే రైతులకు పరిహారం అందించేలా ‘తెలంగాణ విత్తన ఉత్పత్తి, నియంత్రణ మరియు రైతుల సంక్షేమ చట్టం–2025’ ముసాయిదాను రూపొందించింది.డ్రాఫ్ట్‌ బిల్లుపై వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (APC), వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కే. సురేంద్రమోహన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి, సీడ్‌ కమిటీ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, PJTAU డైరెక్టర్‌ (సీడ్స్‌) డా. ఎం.వి. నాగేష్‌కుమార్‌తో పాటు అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు.

రైతు–కంపెనీ మధ్య నేరుగా ఒప్పందం

విత్తన రైతులకు చట్టపరమైన గుర్తింపు, రక్షణ కల్పించడంతో పాటు రైతు–విత్తన కంపెనీల మధ్య నేరుగా పారదర్శక ఒప్పందాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. మధ్యవర్తుల నియంత్రణ, రైతులకు న్యాయమైన ధర, పంట బీమా వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.G.O.Rt.No.198 ద్వారా గతేడాది మే 9న ఏర్పాటు చేసిన కమిటీ డ్రాఫ్ట్‌ బిల్లును రూపొందించింది. కమిటీ రైతులు, విత్తన కంపెనీలు, సీడ్‌ ఆర్గనైజర్లు, డీలర్లు, పంపిణీదారులతో సంప్రదింపులు జరపడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

నకిలీ, నాసిరకం, అనధికార విత్తనాల విక్రయాలపై కఠిన నియంత్రణ తీసుకురావాలని ప్రతిపాదించారు. విత్తనాల ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అధికారాలు కల్పించడం, క్రాప్‌ బుకింగ్‌–సీడ్‌ ట్రేసబిలిటీ వ్యవస్థలను అనుసంధానం చేయడం వంటి చర్యలను ప్రతిపాదించారు.మండల, కమ్యూనిటీ స్థాయిలో సీడ్‌ బ్యాంకులను ప్రోత్సహించడం, సంప్రదాయ–దేశీయ విత్తనాలను పరిరక్షించడం, రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం కూడా ముసాయిదాలో పొందుపరిచారు. దిగుమతి చేసుకునే విత్తనాలకు బహుళ ప్రదేశాల్లో ట్రయల్స్‌ నిర్వహించి నాణ్యతను ధ్రువీకరించే విధానాన్ని కూడా ప్రతిపాదించారు.

పంట నష్టానికి పరిహారం

నాణ్యతలేని లేదా నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టపోయే రైతులకు త్వరితగతిన పరిహారం అందించేలా ప్రత్యేక చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావడం ముసాయిదాలో కీలక ప్రతిపాదనగా ఉంది. దీంతో విత్తన కంపెనీల బాధ్యతను స్పష్టం చేయడంతో పాటు రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

కేంద్రం అనుమతి కోసం డ్రాఫ్ట్‌

డ్రాఫ్ట్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి పొందిన అనంతరం అమలు చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం నుంచి అనుమతి రాకపోతే రాజ్యాంగపరమైన విధానాలను అనుసరించి తెలంగాణ శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణను దేశంలోనే ప్రముఖ ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా మరింత బలోపేతం చేయడంతో పాటు నాణ్యమైన విత్తనాల లభ్యత, రైతుల హక్కుల పరిరక్షణ, నకిలీ విత్తనాల నియంత్రణ, పంట నష్టానికి పరిహారం, విత్తన రంగంలో పారదర్శకత పెంపొందించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల...

Related articles

సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగంపై కీలక చర్చలు

ఎవుసం టీవీ, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, డిజిటల్ వ్యవసాయం తదితర అంశాలపై...

పంటల్లో తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఎవుసం టీవీ, చింతలమానేపల్లి (కొమురంభీం ఆసిఫాబాద్):చింతలమానేపల్లి మండలంలోని డబ్బా, ఆదేపల్లి, బాబాసాగర్ గ్రామాల్లో TRVK, KVK శాస్త్రవేత్తల బృందం మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఆయా...

రబీ సాగుపై రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు

ఎవుసం టీవీ, జమ్మికుంట: రబీ సీజన్‌లో రైతులు అనుసరించాల్సిన సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్...

రసాయనాలకు దూరంగా.. ప్రకృతి సాగు బాటలో రైతులు

కోసిని గ్రామంలో కృషి సఖీల క్షేత్ర సందర్శన ఎవుసం టీవీ, కాగజ్‌నగర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు ప్రకృతి సాగు పద్ధతులపై అవగాహన కల్పించే...
App Icon

Install ETV News App

Add to home screen for faster loading and latest updates.