ఎవుసం టీవీ, రేగొండ (గోరికొత్తపల్లి): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఆత్మ (ATMA) పథకం ఆధ్వర్యంలో గోరికొత్తపల్లి మండలం సుల్తాన్‌పూర్ రైతువేదికలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి తిరుపతి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల వైవిధ్యీకరణ చేపట్టాలని సూచించారు. ఉద్యాన పంటలు, కూరగాయల సాగుతో పాటు ఆయిల్‌పామ్ సాగు ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను రైతులకు వివరించారు.గోరికొత్తపల్లి వ్యవసాయ అధికారి జి. సారయ్య మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న వరి, పత్తి పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలను వివరించారు. ముందస్తు వేసంగిలో పెసర, మినుము, మొక్కజొన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. నేల స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు.ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు తెలిపారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు.అలాగే ఆయిల్‌పామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, సాగు విధానం, మొక్కల ఎంపిక, నిర్వహణ పద్ధతులు, దిగుబడి తదితర అంశాలను వివరించారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఇతర పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల ఎంపికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాడవేన సరిత యుగంధర్, ఆత్మా బీటిటి సభ్యురాలు సీహెచ్. రజిత, ఏఈఓలు దివ్య, ప్రశాంత్, హెచ్‌ఈఓ సురేష్, వెంకటేశ్వర్లు తదితరులతో పాటు రైతులు బానోత్ మొగిలి, పనాస రాంబాబు, లక్కం రామస్వామి, లక్కం తిరుపతి, కేశవేన సాంబయ్య, గజ్జల్లి జలంధర్, దైనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పంటల వైవిధ్యీకరణ అవసరం
Date:
Share post:

